Monday, August 11, 2008

చిన్ననాటి స్నేహితుల కథతో కథానాయకుడు

చిన్ననాటి స్నేహితుల కథతో కథానాయకుడు
తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్, నయనతార, జగపతిబాబు, మీనా ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం కథానాయకుడు. చిన్ననాటి స్నేహితుల కథాంశంతో రూపొందిన చిత్రం ఇది. ఇంకా ఈ చిత్రంలో బ్రహ్మానందం, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, సునీల్, ఎం.ఎస్.నారాయణ, మమతామోహన్‌దాస్‌ తదితరులు నటించారు. కథ:తను ప్రేమించిన శ్రీదేవి (మీనా)తో కలిసి సిరిసిల్ల అనే ఊరిలో బ్రతుకుతెరువు కోసం కుల వృత్తి క్షురకవృత్తిని చేస్తుంటాడు బాలకృష్ణ (జగపతిబాబు). ఆర్బాటాలంటే ఇష్టపడనివాడు బాలకృష్ణ. తాను నమ్మిన దాన్నే ఆచరించే స్వభావం అతనిది. తన షాపును ఆధునికంగా మార్చుకోవాలని వెనుకబడిన తరగతుల సంక్షేమ కార్యాలయానికి వెళ్లి లోను కోసం దరఖాస్తు చేసుకుంటాడు. లంచం తీసుకోను, లంచం ఇవ్వను అని అందులో రాయడంతో తహసీల్థారుకు కోపం వచ్చి లోను కాస్తా ఊడగొడతాడు. తన దగ్గర ఉన్న పాత చెక్క కుర్చీ, మాసిపోయిన అద్దం, పాతకాలపు కత్తెరలతోనే జీవితం సాగిస్తుంటాడు బాలకృష్ణ. అతని దగ్గరే పనిచేస్తున్న సునీల్ మాత్రం మోడ్రన్ షాపు పెట్టి బలవంతంగా అందరినీ లాక్కుని కటింగ్‌లు చేస్తుంటాడు. బాలకృష్ణకు ముగ్గురు పిల్లలు అంతా క్రిస్టిషన్ స్కూల్‌లో చదువుతుంటారు. ఫీజు కట్టేందుకు కూడా డబ్బులు ఉండవు. ఇదిలా ఉండగా ఓ రోజు రాత్రి ఓ ఫకీరు ఆ ఊరికి మంచి రోజులు వచ్చాయంటూ అరుచుకుంటూ వెళ్తాడు. ఎవ్వరూ దానిని అంతగా పట్టించుకోరు. మరుసటి రోజు ఆ ఊరికి మేనేజర్ అలీ వచ్చి సూపర్‌స్టార్ షూటింగ్ అని చెప్పి హోటల్‌వాళ్లకి, కూరగాయలవాళ్లకు డబ్బులు ఇస్తాడు.అనుకున్నట్టుగానే సూపర్‌స్టార్ అశోక్‌కుమార్ (రజనీకాంత్), నయనతారలు వస్తారు. బాలకృష్ణ, అశోక్‌కుమార్ చిన్ననాటి స్నేహితులని భార్య శ్రీదేవికి, బాలకృష్ణ పిల్లలకు తెలుసు. ఈ స్థితిలో తమను అశోక్ గుర్తు పడతాడోలేడో అని సందేహించి అశోక్‌ను కలవకుండా ఉండిపోతారు బాలకృష్ణ దంపతులు. బాలకృష్ణ అశోక్ స్నేహితుడని తెలిసిన ఊరిజనం బాలకృష్ణకు సాయం చేస్తుంటారు. అశోక్‌ను కలిసేందుకు బాలకృష్ణ వెళ్లలేదని తెలిసి అంతా నాటకమని ఊరి జనం నమ్ముతారు. ఇదిలా ఉండగా, ఆ ఊరిలో పాఠశాల వార్షికోత్సవానికి అశోక్‌కుమార్‌ను తీసుకువచ్చేందుకు గౌరవాధ్యక్షుడు ఆర్.ఎస్. అనే వ్యక్తి మంత్రిగారి ద్వారా ప్రయత్నిస్తాడు. అక్కడకు వచ్చిన రజనీకాంత్ ఏం మాట్లాడతాడు? మరి బాలకృష్ణ స్నేహం ఉట్టిదేనా? ఆయన ప్రమేయం ఏమిటి? తమ స్నేహాన్ని అశోక్ గౌరవిస్తాడా అన్ని విషయాలు సినిమాలో చూడాల్సిందే.విశ్లేషణ:బాలకృష్ణ పాత్రపైనే కథంతా నడుస్తుంది. రజనీకాంత్, నయనతార డ్యూయెట్ సాంగ్ బాగుంది. ధర్మవరపు, బ్రహ్మానందం పాత్రలు హాస్యాన్ని పండించాయి. కట్టింగ్ కాంతారావుగా సునీల్ కామెడీ బాగుంది. దర్శకత్వంలో ఏ మాత్రం పట్టుసడలకుండా పి.వాసు జాగ్రత్తపడ్డాడు. రజనీకాంత్ జగపతిబాబు ఇంటికి వచ్చి స్నేహితునిపై ప్రేమను కురిపించే సన్నివేశం చాలా బాగుంది. ఈ సన్నివేశంలో జగపతిబాబు చక్కగా నటించాడు. మొత్తంమీద సినిమాలోని క్లైమాక్స్ సన్నివేశాలు అందరినీ ఆకట్టుకున్నాయి.

No comments: