Friday, May 3, 2013

Telugu Neethi Kathalu - Telugu Moral Stories ...


పిట్ట కథలు, బుర్ర కథలు, ఇంకా మరెన్నో…

TELUGU BLOG WITH STORIES FOR CHILDREN AND GROWN-UPS ALIKE

కాకి దాహం

అనగనగా ఒక అడవిలో ఒక కాకికి చాలా దాహం వేసింది. ఆ రోజు బాగ యెండగా వుంది, ఆ వేడికి కాకి గొంతు పూర్తిగా యెండిప్పోయింది. యెగిరే ఓపిక అయిపోయి, నీరసంగా నీళ్ళ కోసం వెతికింది.
చాలా సేపు వెతికాక ఒక కుండలో నీళ్ళు కనిపించాయి. ఆశగా ఆ కుండలో కాకిముక్కు పెట్టింది. కాని నీళ్ళు బాగ అడుక్కి వుండడంతో కాకిముక్కుకు అంద లేదు.
కాని తెలివైన కాకి ఒటమి ఒప్పుకోలేదు. చుట్టుపక్కలు పడున్న రాళ్ళను తీసుకుని వచ్చి ఆ కుండ లో పడేసింది. కుండ లోకి రాళ్ళు ముణిగిపోయి, నీళ్ళు పైకి తేలాయి. కాకి దాహం తీరే దాకా నీళ్ళు తాగి ఆనందంగా యెగిరిపోయింది.
నిజమే, మనసు వుంటే మార్గం వుంటుంది.
ఈ కధ నేను మా అమ్మాయి మేఘా కి చెప్పాను. అప్పుడు మేఘా నాతో అంది: “పాత కాలం కాకి కనుక కష్టపడి గులకరాళ్ళు వెతికి కుండలో వెశింది. అదే ఈ రోజులలో కాకి అయితే, ఒక straw వెతికి తాగేది”.
ఈ మాట విని నాకు చాల ఆశ్చర్యం అనిపించింది. ఈ కథ వెయ్యి సార్లు విన్నా ఈ మాట నాకు తట్టలేదు. నిజమే ఈ రోజుల పిల్లలు చాలా smart!

నోరు జారిన మాటలు

చాలా సంవత్సరాల క్రితం ఒక ఊరిలో చారుమతి అనబడే ఒక అమ్మాయి వుండేది. ఆ అమ్మాయి రోజంతా గాలి కబుర్లు చెప్పుకుంటూ గడిపేసేది. తను ఇక్కడ మాట అక్కడా, అక్కడి మాట ఇక్కడా చెబుతూ వుంటే చూశి వాళ్ళ అమ్మ చాలా బాధ పడేది. ఇలా గాలి కబుర్లు చెప్పడం తప్పని అమ్మ యెంత చెప్పినా చారుమతి మట్టుకు పట్టించుకునేది కాదు.
ఒక రోజు ఆ ఊరికి తీర్థ యాత్రలు చేస్తూ ఒక సాధువు వచ్చాడు. ప్రసంగంకు వెళ్ళిన అమ్మ తన బాధ సాధువుకు చెప్పుకుంది. చారుమతికి తన తప్పు అర్ధమయ్యేలా చెప్పమని ఆ సాధువును కోరుకుంది. ఆ సాధువు మన్నాడు చారుమతిని తన దెగ్గరికి తీసుకు రమ్మని చెప్పాడు.
మన్నాడు పొద్దున్నే అమ్మ చారుమతిని ఆ సాధువు దెగ్గిరకు తీసుకుని వెళ్ళింది. ఆ సాధువు చారుమతికి ఒక కోడిని చూపించి రోజంతా ఆ కోడి ఈకలు తీసి వూరు మొత్తం జల్లమని చెప్పాడు.
“ఇంతేనా?” అనుకుంటూ అమ్మ చారుమతిని కోడి ఈకలతో వూరంతా చుట్టుకుని రమ్మంది. చారుమతి సంతోషంగా ఊరంతా తిరుగుతూ కనిపించిన వారందరికి కబుర్లు చెపుతూ ఇక్కదో ఈక, అకాడో ఈక విసిరేసింది.
సాయంత్రం సూర్యోస్తమం అవుతుంటే అమ్మ, చారుమతి మళ్ళీ ఆ సధువుదెగ్గిరకు చేరారు. ఈ రాత్రి నిద్రపోయి మళ్ళి తెల్లవారగానె ఇద్దరినీ రమ్మన్నాడు సధువు.
మొన్నాడు పొద్దున్నే సాధువు, “నిన్న రోజంతా విసిరేసిన కోడి ఈకలు వెతికి తీసుకు రా అమ్మా” అని చారుమతితో అన్నాడు.
వెంటనే చారుమతి ఊరంత వెతకడం మొదలెట్టింది. సాయంత్రం దాక ఊరిలో ప్రతి అంగుళం వెతికినా ఒక్క ఈక కూడా కనిపించలేదు. దిగాలుగా చారుమతి సూర్యోస్తమమయ్యె సమయానికి ఆ సధువు దెగ్గిరికి వెళ్ళి, “స్వామి, నన్ను క్షమిచండి. నాకు ఒక్క ఈక కూడ దొరకలేదు” అని తల దించుకుని చెప్పింది.
అప్పడు సాధువు తనకు, “చూశావా, మన మాటలు కూడా ఆ ఈకలు లాంటివే. ఒక్క సారి మన నోరు జారితే ఆ మాటలను మనం యెన్నటికి తిరిగి తీసుకోలేము.” అని చెప్పాడు.
ఆ రోజు నుంచి చారుమతి గాలి కబుర్లు చెపుతూ ఇతర్లని, తన అమ్మని, ఇబ్బందిపెట్టడం మానేసింది.

దీపావళి పోటీ

అనగనగా ఒక ఊరికి ఒక రాజుగారు వుండేవారు. ఆయనికి చుట్టు పక్కల అన్ని రాజ్యాల్లో తన రాజ్యం గొప్పదిగా గుర్తించపడాలని చాలా తాపత్రయం వుండేది.
ఒక సంవత్సరం దీపావళి పండుగ దెగ్గిర పడుతుంటే రాజుగారికి ఓ ఆలోచన వచ్చింది. అన్ని రాజ్యాలకన్న ఆయన రాజ్యం లో పండుగ బాగా జరిగింది అనిపించుకోవాలని ఒక పోటీ ప్రకటించారు. రాజ్యంలో అందరికన్న బాగ దీపాలు పెట్టిన వారికి రాజుగారు స్వయంగా బహుమానం ఇస్తారని రాజ్యమంతా ఢిండోరా వెయ్యించారు.
రాజ్యంలో ప్రజలంతా కూడా పోటీలో ఉత్సాహంగా పాలుకున్నారు. ఒకరినిమించి ఒకరు ఇంటికి దీపాలు పెట్టుకుని అలంకరించుకున్నారు. దీపావళి రోజు సాయంత్రం రాజుగారు తన పరిచారకులతో రాజ్యాన్ని పరియటించారు. యెన్నో అద్భుతమైన ఇళ్ళను చూసి చాల సంతోషించారు.
ఊరి అంచులలో మట్టుకు ఒక ఇల్లు చీకటిగా కనిపించింది. రాజుగారు ఆ ఇంటిని చూశి, “ఆ ఇంట్లో యెవరుంటారు? యెందుకు వాళ్ళు ఇల్లు అలంకరించుకోలేదు?” అంటూ ఆ ఇంటి వైపుకు అడుగులు వేశారు.
ఇంటి దెగ్గిరకు వెళ్ళి చూస్తే ఇంటి బయిట రహదారి లో ఒక చిన్న దీపం వెలుగుతోంది. ఆ దీపం వెలుగులో రహదారిలో ఒక గొయ్యి కనిపించింది. ఇంటి అరుగు మీద ఒక అవ్వ కూర్చుని ఆ దీపం ఆరిపోకుండా అందులో నూనె పోస్తోంది.
ఇది చూశిన రాజుగారు, “అవ్వ, నువ్వు ఇక్కడ యెమి చేస్తున్నావు? మీ ఇంటికి దీపలు యెందుకు పెట్టలేదు?” అని అడిగారు.
“నా దెగ్గిర రోజు ఒక్క దీపం పెట్టే అంత దబ్బే వుంది. రహదారి మీద ప్రయాణం చేసే బాటసారులు ఈ గొయ్యి కనిపించకపోతే ఇందులో పడిపోతారు. అందుకే దీపం నా ఇంటిలో పెట్టుకోకుండా నేను రోజు వచ్చి ఇక్కడ దీపం పెడతాను” అని చెప్పింది.
జవాబువిన్న రాజుగారు చాల ఆశ్చర్యపోయారు. ఊళ్ళో అందరూ వారి ఇళ్ళని దీపలతో అలంకరించికుంటే అవ్వ మట్టుకు బాటసారులకు దారి చూపించటంకోసం దీపం పెట్టిందని, రాజ్యంలో అందరికన్న బాగ దీపాలు పెట్టినది ఆ అవ్వేనని ప్రకటించి, బహుమానం కూడా ఆ అవ్వకి ఇచ్చారు.
మొన్నాడే రాజుగారి ఆదేశంపై పనివాళ్ళు వచ్చి రహదారిలో వున్న గోతిని మరమ్మత్తు కూడా చేసారు.


ఒక రాజు, యేడుగురు కొడుకులు

This story is by request from Rajesh. 
Rajesh – this is one of my favorite stories, thank you for inspiring me to publish. 
అనగనగా ఒక ఊరికి ఒక రాజు గారు వుండేవారు, ఆయనకి ఏడుగురు కొడుకులు ఉండీవారు. ఒక రోజు ఆ యేడుగురు కొడుకులు చాపలు పట్టడానికి వెళ్ళారు. యేడు చేపలు తెచ్చారు. ఆ తెచ్చిన చేపలిని యెండబెట్టారు.
సాయంత్రానికి ఆరు చేపలు యెండాయి కాని, యేడొ చాప యెండలేదు. ఆ చేపను పట్టిన రజకుమారుడు చేపని “చేప చేప ఎందుకు యెండలెదు” అని అడిగాడు. ఆ చేప “గడ్డిమెటు అడ్డమొచ్చింది” అని బదులు చెప్పింది. ఆ రాజకుమారుడు వెళ్ళి గడ్డిమేటుని “నా చేప యెండకుండా యెందుకు అడ్డం వచ్చావు?” అని అడిగాడు. గడ్డిమెటు అందీ “ఈ రోజు ఆవు నన్ను మేయడానికి రాలెదు” అని.
రాజకుమరుడు వెంటనే ఆవు దెగ్గరికి వెళ్ళి, “ఈ రోజు నువ్వు గడ్డి యెందుకు మెయలేదు?” అని అడిగాడు. “నన్ను ఈ రోజు పాలేరాడు తీసుకెళ్ళలెదూ” అని చెప్పింది.
రాజకుమరుడు పాలేరాడిని అడిగాడు “యెందుకు ఈ రోజు ఆవుని గడ్డి మేయడానికి తీసుకుని వెళ్ళలేదు” అప్పుదు పాలెరాడు ఇల అన్నదు, “అమ్మ నాకు అన్నం పెట్టలేదు” అని.
అమ్మ ని అడిగితే అమ్మ అందీ “ఆక్కడ పాప యెడుస్తొంది”
రాజకుమారుడు పాపని “పాప, పాప, యెందుకు యేడుస్తున్నావూ” అని అడిగితే, పాప “నన్ను చీమ కుట్టింది” అని గుక్కలు పెడుతూ చెప్పింది.
రాజకుమారుడు పట్టువదలని విక్రమార్కుడు లాగ చీమ ని కూడ అడిగాడు “చీమ చీమ పాపని యెందుకు కుట్టావూ”
ఆప్పుదు చీమ అంది “నా పుట్టలో వేలు పెడితె నేను కుట్టనా” అని…
చిన్నప్పుడు మా అమ్మమ్మ మాకు ఈ కథ చెప్పేది. చాల కాలం ఇదొక మాములు కథ అనుకున్నను. పెద్దయ్యక మా పిల్లలకు ఈ కథ చెపుతున్నప్పుడు అర్ధం అయ్యంది. ఒకొక్క సారి చాల చిన్న చిన్న సంఘటనలకు పెద్ద పెద్ద ఫలితాలు ఉంటాయని. చిన్న పాపను చీమ కుడితే ఆ రోజు రాజకుమారుడికి రాత్రి భోజనం లో యెండు చాప లేదు. ఇది ఏంగ్లిష్ లో కూడ ఒక కవిత రూపం లో మనం వినే వుంటాము:
For want of a nail the shoe was lost.
For want of a shoe the horse was lost.
For want of a horse the rider was lost.
For want of a rider the message was lost.
For want of a message the battle was lost.
For want of a battle the kingdom was lost.
And all for the want of a horseshoe nail.
Translation in telugu:
మేకు లేక గుర్రపు లాడం పోయె.
లాడం లేక గుర్రం పోయె.
గుర్రం లేక బంటు పోయె.
బంటు లేక సందేశం పోయె.
సందేశం లేక యుధ్ధం పోయె.
యుద్ధం పోతే రాజ్యం పోయె.
అంతా చూస్తే మేకు లేక రాజ్యం పోయె.

బీర్బల్ కాకి లెక్కలు

ఒక రోజు అక్బర్, బీర్బల్ వేటకి వెళ్ళారు. అడవి లో చాలా కాకులు కనిపించాయి. ఆ కాకులను చూసి అక్బర్ మహారాజుకి ఒక ఆలొచన వచ్చింది.
సరదాగా బీర్బల్ తెలివిని పరీక్షిద్దం అనుకున్నారు. వెంటనే తన పక్కన వున్న బీర్బల్ వైపుకు తిరిగి, “బీర్బల్, మన రాజ్యంలో ఎన్ని కాకులు వున్నాయి?” అని అడిగారు.
బీర్బల్ రెప్ప ఆర్చకుండ వెంటనే “సామ్రాట్, మన రాజ్యంలో సరిగ్గా తొంభై తొమ్మిది వేల, ఆరు వందల నలభై మూడు కాకులు వున్నాయి” అని బదులు చెప్పరు.
ఆష్చర్య పోయిన అక్బర్ మహారాజు, “అంత కచ్చితంగా చెబుతున్నావు, అంతకన్నా ఎక్కువ కాకులుంటే?” అని అడిగారు.
“అయితే పక్క రాజ్యాలనుంచి మన రాజ్యంలోని కాకుల చుట్టాలు వచ్చినట్టు” అన్నారు బీర్బల్.
“ఒక వేళ తక్కువ వుంటే?” అని అడిగారు అక్బర్
“అయితే మన రాజ్యం కాకులు వాళ్ళ చుట్టాలని కలవడానికి వెళ్ళినట్టూ!” అని చెప్పారు బీర్బల్.
ఈ కథను ఈ రోజు వరకు బీర్బల్ తెలివితేటలకు, స్థిత ప్రగ్న్యతకు ఉదాహరణగా చెప్పుకుంటారు. నిజమే, తెలివిగా అక్బర్ మహారాజు వేశిన చిక్కు ప్రశ్నకు జవాబు చెప్పారు కద! మీరేమంటారు?

వేరుశనగ దొంగ

కొన్ని సంవత్సరాల క్రితం ఒక వూరిలో లక్ష్మి పేరుగల ఒకావిడ వుండేది. ఆఅవిడకు రోజు సాయంత్రం ఇంటి దెగ్గిర వున్న పార్కులో ఒక బెంచి మీద కూర్చుని తనతో తెచ్చుకున్న పుస్తకం చదవడం అలవాటు. రోజు అదే బెంచి మీద కూర్చునే అలవాటు పడిన లక్ష్మిగారికి కొద్దిరోజలకి ఆ బెంచి ప్రత్యేకించి తనదే అన్న ఒక భావం ఏర్పడిపోయింది.
అలాగే ఒక రోజు పర్కులోకి వెళ్తుంటే అక్కడ వేడి వేడి గా వేరుశనగలు అమ్ముతున్న బండివాడు కనిపించాడు. వాసనకి నోరూరిన లక్ష్మి గారు ఒక పొట్లం వేరుశనగలు కొనుక్కుని తన మామూలు పధ్ధతి లో తన బెంచి కి వెళ్ళింది. చూస్తే అక్కడ తన బెంచి మీద అప్పటికే ఒక పెద్దాయిన కూర్చుని వున్నరు.
రుసరుసలాడుతూ తన షాల్వా, పర్సు, కూడా తెచుకున్న ఇతర సామాన్లు, చేతిలో వేరుశనగల పొట్లం పక్కన పెట్టి కూర్చుని పుస్తకం తీసింది.
చదువుతూ పక్కనవున్న వేరుశనగల అందుకుని వల్చుకుంటూ తినడం మొదలుపెట్టింది. తీరా చూస్తే పక్కనున్న పెద్దాయన కూడా అదే పొట్లంలోంచి వేరుశనగలు తీసుకుని తింటున్నారు. “యెంత పొగరు, అడగకుండానే నా వేరుశెనగలు తినేస్తునాడు, ఇలాంటి వాళ్ళు వుండ బట్టే మన దేశం ఇలా వుంది” అని మనసులో లక్ష తిట్టుకుంటూ పైకి ఏమి అనలేక అలాగే కాసేపు కూర్చుంది. కొద్ది సేపటి తరువాత ఎక్కడ పెద్దాయన వేరుశనగలు అన్ని తినేస్తారో అని లక్ష్మిగారు కూడ పోటి పడి గబ గబా మిగిలిన వేరుశెనగలు వల్చుకుని తినేసింది. అన్ని అయిపోయి చివరికి ఒక్క వేరుశనగ మిగిలింది. ఫెద్దాయన చిరునవ్వుతొ “ఇది మీరు తీసుకోండి” అని లేచి చిన్నగా నడుచుకుంటూ వెళ్ళిపోయరు.
ళక్ష్మిగరు “వేరుశనగ దొంగ!” అని చికకుగా అనుకుంది.
లేచి తన సామను బెంచి మీద నుంచి తీసుకుంటు చూస్తే అక్కడ తన వేరుశనగ పొట్లం భద్రంగా తన దెగ్గిరే కనిపించింది.
“అయ్యో! ఐతే నేనే వేరుశనగ దొంగనా! పాపం అయ్యిన్ని ఎన్ని మాటలనుకున్ననో!’ అని చాలా బాధ పడింది.

మూడు చేపల కథ

అనగనగా ఒక చెరువు లొ చాల చేపలు వుండేవి. ఒక రోజు ఇద్దరు చేపలు పట్టే వాళు ఆ చెరువు దెగ్గిరనుంచి వెళ్ళారు. చెరువు లో చాలా చేపలు వున్నాయని గమనించి మన్నాడు ఆ చెరువు లో చేపలు పడదామని నిర్ణయించు కున్నారు.
వాళ్ళ మాటలు విన్న ఒక పెద్ద చేప ఈ విషయం ఇంకొ రెండు చేపలకు చెబుతూ – “మనం వెంటనే మన బంధువులను తీసుకుని ఈ చెరువు ని వదిలి వెళ్ళిపోవాలి – లేక పోతె రేపు మనం ప్రాణాలతో వుండము” అని వివరించింది.
ఈ మాటలు విన్న వేరే రెండు చేపలు ఆలొచన లో పడ్డాయి.
రెండో చేప, “వాళ్ళు రేపు వస్తే చూద్దాం” అనుకుంది.
మూడో చేప, “ఈ ముసలి చేపకు చాదస్తం ఎక్కువ – ఆ చేపలు పట్టే వాళ్ళు వచ్చినా మన అద్రుష్టం బాగుంటే వాళ్ళేమి చేస్తారు” అనుకుంది.
మొదటి చేప రాత్రి కి రాత్రి తన బంధువులతో ఈదుకుంటూ వేరే చెరువుకు వెళ్ళి పొయింది.
తెల్లవారగనే రెండో చేప నేరుగా వస్తున్న చేపలు పట్టే వాళ్ళని చూసి తన కుతుంబం తో వేరే చెరువుకు వెంటనే వెళ్ళి పొయింది.
మూడో చేప వల లో చిక్కుకుని ప్రాణాలను వదులుకుంది.
దూరదృష్టి తో ఆలోచించిన మొదటి చేప తన బంధువులునందరినీ కాపడుకో గలిగింది. ఆపాయం గ్రహించి వెంటనే చర్యలు తీసుకున్న రెండొ చేప కొంత వరకు తన కుటుంబాన్ని కాపడుకుంది.
ఆదృష్టాన్ని నమ్ముకున్న మూడో చేప మట్టుకు యేమి చేయలేక పొయింది.
అలాగే మన జీవితం లో కూడా కేవలం అదృష్టాన్ని నమ్ముకుని, మన వంతు కృషి మనం చేయకపోతే, లాభం ఫలించదు.

కోతి, అద్దం

ఒక అడివిలో ఒక కోతికి ఓ అద్దం దొరికింది. అది ఆ అద్దాన్ని అడవిలో జంతువులన్నిటికీ చూపించింది.
భల్లూకం అందులో తన ప్రతిబింబం చూసుకుని, “అయ్యో, నేను ఇంత కురూపినా” అనుకున్నాడు.
తోడేలు చూసి నేను కూడ జింకలాగా వుంటే బాగుండేది, అనుకుంది.
ఇలా ఒకటి తరవాతోకటి అన్ని జంతువులు వాటి ప్రతిమలను చూసుకుని ఇలా వుంటే బాగుండేది, అలా వుంటే బాగుండేది అనుకున్నాయి.
చివరికి కోతి ఆ అద్దం ఒక వివేకవంతమైన గుడ్లగూబ దెగ్గిరకు తీసుకుని వెళ్ళింది. ఆ గుడ్లగూబ, “వద్దు నాకు చూపించద్దు. ఆ అద్దం చూసుకున్న వాళ్ళంతా అసంతృప్తి పడడం తప్ప దాని వల్ల వాళ్ళకు వచ్చిన ఙానము లేదు, విచక్షణ లేదు. అలాంటి దాన్ని చూసి బాధ పడడం అనవసరం” అని అంది.
కోతి ఒప్పుకుని ఆ అద్దాన్ని నదిలోకి విసిరేసింది.

అద్దం, రాయి

ఒక రోజు ఒక అద్దం ముక్క ఒక రాయి తో ఇలా అంది: “నన్ను చూడు, నేను ఎంత మెరుస్తున్నానో? ఆ సూర్యుడే నన్ను మెచ్చుకుని నాకీ మెరుపునిచ్చాడు”.  ఆ రాయి, “అలాగా, నా అభినందనలు” అని సమాధానమిచ్చింది.
కొన్ని రోజుల తరువాత ఒక పిడుగు అద్దం మీద పడింది. అద్దం పిడుగు మంటకు కాలిపోయి, దాని మొత్తం మెరుపును కోల్పోయింది.
ఆ రాయి, “నీ మెరుపు ఏమైంది?” అని అద్దాన్ని అడిగింది.
“ఒహ్, ఆ పిడుగు వచ్చి నా దెగ్గిర అరువు తీసుకుంది” అన్నదా అద్దం.
“ఒక్క సారి మన గొప్ప చాటుకున్నాక ఎన్ని అబద్ధాలాడాలో” అనుకుంది రాయి.

చారలు కోరిన నక్క

పులి దర్జా గా అడివిలో తిరుగుతూ వుంటే అన్ని జంతువులు ఈ పక్క, ఆ పక్కా భయంతో పారిపోతూ వుండేవి. అది చూసి ఓ నక్క చాలా కుళ్ళుకునేది. అన్ని జంతువులు పులికి భయపడతాయి, దీనికి కారణం ఏమిటి అని ఆలొచిస్తే కారణం పులి చారలే అయి వుంటాయని అనుకుంది. అనుకున్నదే తడవుగా ఓ కంసాలాడి దెగ్గిరికి వెళ్ళి అలా పులిలా చారలు పెట్టమని అడిగింది. అతను బాగా ఇనప కడ్డి కాల్చి వాత పెట్టాడు. ఒక వాత పెట్టే సరికే భరించలేక కేకలు పెట్టి, “చారలు కావాలికాని నొప్పి కాదు, ఇంకేదైన చేయి” అంది నక్క. “ఐతే రంగులు పులివించుకో” అన్నాడు కంసాలాడు.
రంగులు వేసే వాడి దెగ్గిరకు వెళ్ళి రంగులు పులవమని అడిగింది. అతను నక్క అడిగినట్టే రంగులద్దాడు. ఆ రంగులు చూసుకుని మురిసిపోయింది నక్క. వెంటనే అడివిలోకి వెళ్ళి, పులి లాగ గాండ్రించబొయి, ఒక ఊళ్ళ పెట్టింది. ఆ ఊళ్ళ విని పారిపోబోతున్న జంతువులు కూడా దాని చుట్టూరా తిరుగుతూ ఆశ్చర్యంగా చూసాయి. ఇంతలో వాన పడి నక్క తనపై అద్దించుకున్న చారలన్ని నీళ్ళల్లో కలిసి చెరిగి పోయాయి. ఇది చూసి చిన్న చిన్న జంతువులు కూడ నక్కను వెక్కిరించడం మొదలెట్టాయి.
ఒకళ్ళని చూసి మన తీరు మార్చుకోకూడదని నక్కకు ఆ రోజు బాగా తెలిసొచ్చింది